Sri Tattvamu    Chapters   

శ్రీమాత్రే నమః

శ్రీ శ్రియానందనాథ గురువేనమః

శ్రీతత్త్వస్వరూప నిరూపణ

శ్రు|| ఇమానుకం భువనాసీషధేమ | ఇన్ద్రశ్చ విశ్వేచ

దేవాః| యజ్ఞంచ సస్త్సస్వంచ ప్రజాంచ | ఆదిత్యైరిన్ద్రస్సహ

సీషధాతు || అదిత్యైరింద్ర స్సగణోమరుద్భిః| అస్మాకం భూత్వ

వితాతనూనాం| అప్లవస్వ ప్రప్లవస్వ | ఆండీభవజ మాము

హుః| సుఖాదీం దుఃఖనిధనాం | ప్రతిముంచస్వ స్వాం పురం||

మరీచయస్స్వాయంభువాః| యేశరీరాణ్య కల్పయ& | తే తే

దేహంకల్పయన్తు| మాచతే ఖ్యాస్మతీరిషత్‌|| ఉత్తిష్ఠత మా

స్వప్త| అగ్నిమిచ్ఛధ్వం భారతాః | రాజ్ఞస్యోమస్య తృప్తాసః|

నూర్యేణ స యుజోషసః|| యువాసువాసాః| అష్ఠాచక్రా నవ

ద్వారా | దేవానాం పూరయోధ్యా|| తస్యాగ్‌ం హిరణ్మయః

కోశః | స్వర్గోలోకోజ్యోతిషా77వృతః| యోవైతాం బ్రహ్మ

ణో వేద| అమృతేనావృతాం పురీం | తసై#్మ బ్రహ్మచ బ్రహ్మా

చ| ఆయుః కీర్తిం ప్రజాందదుః|| విభ్రాజమానాగ్‌ం హరిణీం

యశసా సంపరీవృత్తాం | పురగ్‌ం హిరణ్మయీం బ్రహ్మా| వివేశా

పరాజితా || పరాజ్ఞేత్యజ్యోమయీ | పరాజ్ఞేత్యనాశకీ | ఇహ

చాముత్రచాన్వేతి | విద్వాన్దేవాసురానుభయాన్‌ | యత్కుమారీ

మన్ద్రయతే | యద్యోషిద్యత్పతివత్రా|| అరిష్టం యత్నించ

క్రియతే| అగ్ని స్తదనువేధతి|| అశృతా సశృతానశ్చ| యజ్వానో

యే7ప్యయ జ్వనః | స్వర్యంతో నాపేక్షన్తే | ఇన్ద్రమగ్నించ

యే విదుః | సికతా ఇవసంయంతి | రశ్మిభిస్సముదీరితా | అస్మా

ల్లోకాదముష్మాచ్చ | ఋషిభిరదాత్పశ్నిభిః||

- అరుణోపనిషత్తు.

(తైత్తిరీయారణ్యకము - ప్రథమప్రపాఠము)

క్షణికములైన బుద్బుదప్రాయములైన భోగభాగ్యము లాసించి, పూర్వజన్మ సముపార్జిత ప్రారబ్ధకర్మపాశబద్ధులై, సంసరణుబండియందు బడియుండు జీవకోటి నుద్దేశించి వారి సముద్ధరణ నాశించి మంత్రద్రష్టలైన ఋషులు పృశ్నినామకులు అనుగ్రహించి శ్రీవిద్యోపాసనావశ్యకతను తత్ఫలితమును ప్రకటించుచున్నారు. ఇందలి ప్రకటార్థమును రహస్వార్థమును వరుసక్రమమున నుదహరింతును.

ప్రకటార్థము :- ఇందు ఆరాధ్యదేవత అరుణకేతుకాగ్ని. ఇంద్రాది దికాల్పులురు, విశ్వేదేవతలు అరుణకేతువు నుపాసించి కృతార్థులై తమ తమ పదవులను ఆధిపత్యమును స్థిరపరచుకొనినారు. ఇచట భూలోకములన మనమును, మనమేకాక చుతర్దశ భువనములందలి జీవకోటియు సుఖమును బడయుచున్నాము. సకల దేవతాలబృంద పరివృత్తుడై స్వర్గాధిపతి ఇంద్రుడు మమ్ములను మాసంతానమును సుఖవంతులుగా జేయుగాక! నిరంతర మును మమ్ములను కంటికి ఱప్పవలెగా చుచుండునుగాక!

ఓ జీవుడా! ఈ శరీరము నీమాతాపితల రక్తశుక్ల సమ్మిళితము. ఇది క్షణభంగురము. బుద్బుదప్రాయము. నశించు స్వభావముగలది. ఇట్టి అవరణములు ఇదివరలో నీకు ఎన్నియో కలిగినవి. భవిష్యత్తునందును కలుగనున్నవి. ఈ సంసారచక్రమున బడి ఎంతకాల మిటుల చావుపుట్టుకలతో పరిభ్రమించెదవు? తరణోపాయము నెన్నడైన ఆలోచించితివా? లేదు. జర్జరితమగుచున్న నీశరీరముపై భ్రాంతివిడుటకు ప్రయత్నించితివా? లేదు. వివేకధనమును సముపార్జింప నమకట్టితివా? లేదు. అయ్యో! పాపము ! స్వాయంభువులైన మరీచ్యాదులు ఈ ప్రపంచ నిర్మాతలు. పరోపకార పరాయణునిగా నిన్ను అనుగ్రహింతురుగాక! దిగంతవ్యాప్తమైన యశశ్చంద్రికలు నీకు లభ్యమగునటుల ఆశీర్వదింతురుగాక!

ఓహో! ఋషులారా! లెండు ! నిద్ర చాలింపుడు. మాంద్యతను వీడుడు. ఉత్సాహవంతులు కండు. అదిగో ! ఉషఃకన్య పూర్వదిశాంతరమున తొంగిచూచుచున్నది. పరిశుభ్రమైన వస్త్రములదాల్చి హవిస్సు గ్రహించి అరుణకేతు కాగ్నిని పూజింపుడు. సోమపానముజేసిన మీరు సూర్యప్రభాభాసమాన తేజోవిరాజితు లగుదురుగాక!

మీ స్థూలశరీర మెట్టిదో వివరము తెలిసికొంటిరా? లేదా? ఐతే వినుడు.

ఇది యొక దేవపట్టణము. మూలాధారాది సహస్రాంతమైన ఎనిమిది చక్రములు ఇందున్నవి. తొమ్మిది ద్వారములు గలవు. ద్వారముల వివరము లడుగుచున్నారా? వినుడు. ఊర్ధ్వకాయమున ఏడు; అథఃకాయమున రెండు, వెరశి తొమ్మిది ద్వారములు. నీ శరీరమే పట్టణము. ఇంద్రియములే దేవతలు. ద్వారములను తెఱచికొని లోనికి ప్రవేశించుట సామాన్యులకు అలవిగాదు.

సద్గురూపదిష్టమార్గమున సాధనజేసినచో - జ్ఞానమను పరికరము మీకు లభ్యమగును. దీనిచే కవాటభేదన మొనర్చిలోనికి అడుగిడుచో అచట జీవచైతన్యముచే ప్రకాశించు హిరణ్మయకోశము కాననగును. అదిగో అందే అకోశమునందే సచ్చిదానంద పరబ్రహ్మము వసించుచున్నాడు.

ఇట్టి నీ యీ శరీరస్థితిని అవగతము చేసికొని మూలస్థానమును చేర ప్రయత్నించుచో నీకు లభ్యముగాని దేదియు నుండదు. నీ కృషి ఫలించుచో బ్రహ్మయు పరబ్రహ్మయు చిరాయురారోగ్యైశ్వర్యముల ప్రసాదింతురు.

ఓహో! ఈపరబ్రహ్మము ఎట్టివాడని యగుడుచుంటిరా? అతడు పునరావృత్తి రహితుడు. ఆధివ్యాధులు జరామరణములు అతనిచెంతకు చేరవు. ఇచట ఈ లోకములుందును అచట ఆలోకములందును ప్రతియొక జీవరాశియందును ఒక అంశ##చే నిండియుండి చైతన్యశక్తిని ప్రసాదించుచున్నాడు.

తెలిసియును తెలియకను మనోవాక్కాయకర్మముల మనము చేయు పాపములు అపారములు.

వివాహాత్పూర్వమే పురుషుని కవయగోరు చిన్నది పాపభాక్కు. నవమోహనగర్వమున విఱ్ఱవీగు యువతియొక్క పరపురుష సంభోగవాంఛ పాపహేతువు. భర్తయనురాగమును బొందలేని పతివ్రతయొక్క ఆత్మహత్యాయత్నము పాపభాజనము. ఎట్టి దానములచేతనుగూడ తూలిపోవని పురుషుని పాపరాశి - ఒకటేమిటి? ఎట్టి ఘోరాతిఘోర పాపములైనను అరుణకేతుకాగ్ని నుపాసించుటచే సమసిపోవును.

పండితుడు, పామరుడు, బ్రహ్మణుడు, శూద్రుడు, ఎవడేయగుగాక! ఎట్టివాడే యగుగాక! పరమైశ్వర్యయుక్తుడగు అరుణకేతుకాగ్నిని పూజించి మోక్షపథము నందగలడు.

జీవులను సంసారమను చెఱసాలయందు బంధించి పడవేయు పాశములు - ఫలాపేక్షతో గూడిన కర్మలు; యజ్ఞ యాగాదులు; అగ్నిష్ఠోమాది క్రతువులు. కర్మవశానుగులమై మనము అనావశ్యకములైన విషయములపై మనస్సు లగ్నము చేసి విషయపాశములచే బంధింపబడుచున్నాము. ఈ పాశము లన్నుంతవరకు మనము పశువులమే. భగవానుడు పశుపతి. మనము కోరునది ఏమి? ధనము, ¸°వనము, అసమాన సౌందర్యలసమానయైన యువతి; చెప్పుచేతలబడియుండు పరిజనము, వీనిని అనుభవించుటకు పరిపూర్ణ అయువు, ఆరోగ్యము.

ఇట్టి కోరికలనెడి పాశములచేత మనము బంధింపబడినాము. పశుపతిచే మనలనుఉద్ధరించుటకే, ఈ పాశవిముక్తులను జేయుటకే సత్యజ్ఞాన ప్రబోధకములైన దివ్యమంత్రములు ప్రకటింపబడినవి.

వానిని అభ్యసించి శక్తిసంపాదించుకొని తల్లికడకుజేరుగోవత్సమువలె నిరతిశయానందప్రదానియైన శ్రీమాత నాశ్రయింతము. దయామయి ఆమె. ఆమెయే మనకు ఐహికాముష్మిక సుఖముల ప్రసాదించును. ఇది ప్రకతార్థము. ఇక రహస్వార్థము నవలోకింతము.

కరుణాతరంగిణి అరుణాదేవి; ఇందు ఉపాస్యదేవత. ''అరుణకేతువు'' అను ఋషిపుంగవుడు మంత్రద్రష్ట. విశ్వమానవ శ్రేయస్సు నర్థించి ఇందలి నిగూఢార్థమును ప్రకటించినాడు. దిఙ్మాత్రముగా నిట పరికింతము.

''పృశ్ని''నామక ఋషులు ఒక చోచేరి పరస్పర మిటుల వితర్కించుకొనిరి.

1. ఇమానుకం భువనాసీషధేమ||

చక్ర విద్యను అనగా శ్రీవిద్యను సంపాదించి చతుర్దశ భవనములను అధిగమించెదముగాక!

2. ఇన్ద్రశ్చవిశ్వేచ దేవాః||

ఇంద్రాది అష్టకదిక్పాలురు, విశ్వేదేవతలు- శ్రీవిద్యో పాసకులే.

3. యజ్ఞంచ స స్త్సస్వంచ ప్రజాంచ||

అదిత్యై రిన్ద్రః సహసీషధాతు||

శరీరపోషణకు, సంతానోత్పత్తికిని సాధనము సహధర్మ చారిణి. అగ్నిష్ఠోమది యజ్ఞములును అటులనే పరిమిత ఫలప్రదములు. శ్రీవిద్యమాత్రము అటులగాదు. అది సర్వశక్తి సంపుటము. సర్వైశ్వర్యప్రదము. జన్మజరామరణ వివర్జితమైన అమృతధామమును జేర్చు ఆ ప్తమిత్రము. ద్వాదశాదిత్యులు, మరుద్గణ సప్తకము, ఇంద్రాది దిక్పాలాష్టకము అందరును శ్రీవిద్యాపారంగతులే. స్వర్తాధినేత ఇంద్రుడు మాకు శ్రీవిద్యను ఉపదేశించుగాత!

4. ఆదిత్యై రిన్ద్రః నగణో మరుద్భిః||

5. అస్మాకం భూత్వవితా తనూనామ్‌||

పరివారసమేతుడైన దేవలోకాధిపతి సపరివారముగా మమ్ములను రక్షించుగాక ! ఆ భాగ్యశాలియే మాయోక్షేమ భారమును వహించుగాక !

శ్రీవిద్యా ప్రాశస్త్యతను ఋషులు చెప్పుచున్నారు:-

6. అప్లవస్వ - ప్రప్లవస్వ||

డెబ్బడిరెండు నాడులయందును ఆపాదమస్తకము అభివర్షించుము. అభిషేకించుము.

7. ఆండీభవజ మాముహుః||

అంతరమున పిండాండమునను, బాహ్యమున బ్రహ్మాండరూపమునను భవనసాయుజ్యుమను ప్రసాదించి మమ్ముల ననుగ్రహింపుము.

8. సుఖాదీం దుఃఖనిధనామ్‌||

సుఖసంపాదకుడైన చంద్రుడు బైందవస్థాన మలంకరించినాడు. అట్టి బైందవస్థానమే మోక్షధనమునకు ఖని. సుఖాదీం = ఆనందప్రదమును, దుఃఖనిధనాం = అవిద్యావిషయక దుఃఖనాశనము ఎట్టి అవస్తనొందుటచే కలుగునో అట్టి భూమికయే దుఃఖనిధనస్థానము.

చర్మచక్షస్సులకు గోచరముగానిది అమృతధామము అదియే పరాశక్తికి నిలయము. సుఖప్రదమై.న ధారణాశక్తిచే, అందు చేరగలుగుటయే దుఃఖనిధనము.

9. ప్రతిముంచస్వ స్వాం పురమ్‌||

శక్తితత్త్వమును, శ్రీతత్త్వమును అవగతము జేసికొని ఆమె చరణకమలముల నాశ్రయింపుము.

10. మరీచయ స్స్వాయంభువాః||

ఆమె శరీరము నుండి దివ్యకాంతులు ఉత్పన్నమైనల్దెసల నావరించినవి. ఆదివ్యకాంతులే సూర్యచంద్రాగ్నులకు శక్తిని సామర్థ్యమును కలుగజేయుచున్నవి.

11. యేశరీరాణ్యకల్పయన్‌||

ఈ దివ్యమయూఖజాలమే జీవకోటిని రూపొందించినవి. ఇవియే (మున్నూటఅరువదియైదుదినములుగలసంవత్సరమును) కాలమును నిబంధించుచున్నవి.

12. తే తే దేహం కల్పయన్తు||

ఆ దివ్యమయూఖ రోచిస్సులు అరుణాదేవి చరణకమల విష్ఠ్యూతములు.

13. మాచతై ఖ్యాస్మతీరిషత్‌||

శ్రీమాతా! నిరంతరమును నీయశోగానము చేయుచు భవద్విషయక జ్ఞానము నితోధికముగా సముపార్జించుకొనెదముగాక!

ఉపాసనాసమయ మెట్టిదని నిర్ణయించుచున్నారు:-

14. ఉత్తిష్ఠత మాన్వస్త అగ్నిమిచ్ఛధ్వం భారతాః|

రాజ్ఞః సోమస్య తృప్తాసః నూర్యేణ స యుజోషనః||

భారతాః=భా+రతాః=భాయాం అనగా జ్యోతిస్వరూపిణియగు శ్రీవిద్యయందు రతాః=ఉపాసనాసక్తిగల సాధకులారా! 'ఉత్తిష్ఠత'=లెండు, మాస్వస్త = నిద్రచాలింపుడు మాంద్యమును విడుపుడు. ఉత్సాహము నవలంబింపుడు. స్వాధిష్ఠానగతాగ్నిని ప్రజ్జ్వలింప జేయుడు. చంద్రమండలాంతర్గత బైందవస్థానగతుడైన సోముని సుధానిష్యందముచే తనివి నొందుడు. అనాహత విశుద్ధాంతరాకాశమున బాలభానుని ఉదయమును గాంచి ఉపాసన కుపక్రమింపుడు. సారాంశము :- శ్రీమాత నిధిధ్యాసములకు ఉషఃకాలము ఉచితమైన నిర్దిష్టమైన సమయము.

15. యువా సువాసాః||

ఉపాసకుడు పరిపూర్ణ ఆరోగ్యసంపన్నుడై సుదృఢ గాత్రుడై యుండవలయును. మాలిన్యరహితమైన శుభ్రవస్త్రములను దివ్యమాల్యాభరణములను ధరించవలయును.

శ్రీచక్ర స్వరూప నిర్ణయము:-

16. అష్టాచక్రా నవద్వారా||

అది ఎనిమిది చక్రములు, తొమ్మిది ద్వారములు గలది.

17. దేవానాం పూరయోధ్యా||

ఎనిమిది - పన్నెండు - పదునాలుగు; కోణములు ఎనిమిది; పదునాఱు దళములు; మూడు వలయములు; మూడు రేఖలు అదిగాగలవి ఎనిమిది చక్రములు. త్రికోణరూపములై - ఊర్ధ్వముగా నాలుగు; అధోముఖముగా నైదు వెరశి తొమ్మిది ద్వారములు గలది శ్రీచక్రము. ఇది ఇంద్రాది దేవతానీకముచే పూజింపబడునది. దేవతలు అనగా ఇంద్రియములు. పంచవింశతి తత్త్వాత్మక ఇంద్రియములకు అనగా దేవతలకు అధిష్ఠానమైన 'దేవానాంపూః' దేవపట్టణము శ్రీవిద్యానగరము ఈ శరీరము. శరీరమే శ్రీచక్రము.

శ్రు|| తేన నవరంధ్రరూపో దేహః నవచక్రరూపం శ్రీచక్రం||

- భావనోపనిషత్తు.

కనుక నవద్వారములతో గూడియున్న సాధకుని స్థూల శరీరము తొమ్మిది చక్రములతో గూడియున్న శ్రీచక్రముగా భావింపవలెను.

సహస్రారా అనాహత స్వాధిష్ఠానములు సోమ, సూర్య, అసలాత్మకములు. ఈ త్రిపుటియొక్క సమ్మేళనచేనైన అవరణమే, నిలయమే శ్రీమాత శరీరము.

శ్లో|| బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ

మన్వస్రనాగదళసంయుత షోడశారం,

వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ

శ్రీచక్ర మేతదుదిదం పరదేవతాయాః||

- 'శ్రీచక్రం శివయో ర్వపుః'

ఇది మందభాగ్యులకు అయోధ్య అనగా బేదింపరానిది, సాధింపరానిది, చేరరానిది.

18. తస్యాగ్‌ం హిరణ్మయః కోశః| స్వర్గలోకోజ్యోతిషావృతః||

శ్రీచక్రముయొక్క మధ్యభాగమున, అనగా బైందవ స్థానమున, సహస్రదళ కమలకోశము గలదు. తత్కోశము సహస్రకోటి సూర్యప్రభా భాసమానము.

19. యోవైతాం బ్రహ్మణో వేద| అమృతే నావృతాంపురీం|

తసై#్మ బ్రహ్మచ బ్రహ్మాచ | ఆయుః కీర్తిం ప్రజాందదుః||

ఇందు శ్రీవిద్యోపాసనా ఫలితము చెప్పబడినది. సుధాసింధు మధ్యస్థిత మణిద్వీపమున, చింతామణి గృహాంతరముప. కామేశ్వరాంకస్థితమైన, జ్ఞానానందలహరీరూపయగు శ్రీమాత కామేశ్వరిని, చంద్రమండల గళత్పీయూషధారా7భిషిక్తులగు ''కతిచన'' అనగా కొందరు సాధక శ్రేష్ఠులు మాత్రమే జ్ఞాన పూర్వక సాధనచే తెలిసికొనగలరు. అట్టివారే ధన్యులు ఆయుష్మంతులు; యశోవంతులు; బహుపుత్రవంతులు. ఇచట పుత్రులు అనగా, శిష్యులు అనియు చెప్పవచ్చును.

శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే

మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే

శివాకారే మఞ్చే పరమశివ పర్యటఙ్కనిలయాం

భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదాసందలహరీం||

- సౌందర్యలహరి.

20. విభ్రాజమానాగ్‌ం హరిణీమ్‌ | యశసాసంపరీవృతాం |

పురగ్‌ం హిరణ్మయీం బ్రహ్మా | వివేశా పరాజితా ||

శ్రు|| ఈశానస్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం |

బ్రహ్మా7ధిపతి ర్బ్రహ్మణో7ధిపతి శివోయే అస్తు సదాశివోమ్‌||

అను శ్రుతి ప్రమాణము ననుసరించి ఇచట బ్రహ్మయనగా సదాశివుడు. 'అపరాజిత' అనగా సా7దాఖ్య. చంద్రకలా, షోడశీనామాంకిత - శ్రీమాత శ్రీరాజరాజేశ్వరి. ఈ పురాణ దంపతులు ఇరువురును శ్రీవిద్యానగరమునందలి చింతామణి గృహమును ''వివేశ'' = ప్రవేశించిరి.

శ్రు| బైందవే చింతామణిగృహే సదా శివః సర్వదా సన్నిహితః | అపరాజితా కుండలినీశక్తిః షట్చక్రాణి భిత్వా భూయో భూయః ప్రవిశతి|| అను శ్రుతి ఇందుకు ప్రమాణము.

21. పరాజ్ఞేత్యజ్యోమయీ | పరాజ్ఞేత్యనాశకీ||

శ్రీచక్రలేఖన క్రమ మిట వివరింపబడినది:-

పునరావృత్తి రహిత, నిత్య, నిరతిశయానందమయి శ్రీమాత. మూడు; ఎనిమిది; పండ్రెండు; పదునాలుగు; పదునాఱు; వెరశి ఐదు కోణములు. ఇవియే చక్రములు యోనులు అనియు చెప్పబడుచున్నవి ఇవి శక్తియోనులు; శాక్తములు అనియు పిలువబడును. బిందువు; అష్ఠదళము; షోడశదళము; చతురశ్రము; అను నాలుగు శివచక్రములు శివయోనులు; శైవములు అనియు పిలువబడును. సృష్టి నిర్మాణహేతువు లగుట నివి ''యోనులు'' అని చెప్పబడినవి. శైవములైన నాలుగు, శాక్తములైన ఐదు; వెరశి తొమ్మిది నవయోన్యాత్యకము శ్రీచక్రము. శివశక్తుల ఉభయరూపమిది. యోనులు పరస్పరము అవాఙ్మఖములు.

22. ఇహచాము త్రచాన్వేతి | విద్యాన్దేవాసురానుభయాన్‌||

''దీప్యంతీతి దేవాః'' ప్రకాశమానములైనవి. శక్తివంతము లైనవి ఏకాదశేంద్రియములు. ఇవియే దేవతలు. ''అసురాః అసవః ప్రాణాః తాన్‌రాంతి ఆదదతి - ఇతి పంచతన్మాత్రా ఉచ్యంతే||

ప్రాణాపాన వ్యానోదాన సమానము లనియెడు పంచ ప్రాణములు; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయము లనియెడు పంచ ఉపప్రాణములు వెరశి పది అనురులుగా పేర్కొనబడినవి.

పంచవింశతి తత్త్వజాతములైనమాయా, శుద్ధ, మహేశ్వర, సదాశివులను ఏతత్పంచవింశతి తత్త్వవిలక్షణయైన షడ్వింశ త్తత్త్వము, శివశక్తి సంపూటాత్మకమును అగుపరాశక్తిని గుర్తెరిగి ఉపాసించు సాధకులు తరతమ భేదముల ననుసరించి ఇహలోకమున అతులమైన ఐశ్వర్యసుఖసంపదల ననుభవించి, పరలోకమున సార్ష్యి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యాత్మకములైన పంచవిధముక్తులను బడయుదురు.

స్థూలము; సూక్ష్మము; పరా; యని ఉపాసన మూడు తెఱగులు.

సూక్ష్మ ఉపాసనావిధానము ఈదిగువ నుదహరింప బడినది:-

23. యత్కుమారీ మంద్రయతే యద్యోషిద్యత్పతివ్రతా||

అరిష్టం యత్కించ క్రియతే | అగ్ని స్తదనువేధతి||

కుమారి; యువతి; పతివ్రత; యని కుండలినీశక్తిని మూడు తెఱగులుగా విభజించి నిర్వచించినది భగవతిశ్రుతి.

సర్వాత్మకము కుండలిని. ప్రథమదశయందు సుప్తోత్థితయై సర్పమువలె మంద్రస్వరముచేయును. ఇట్టి దశయందు పరాశక్తి ''బాల'' ''కుమారి'' యని పిలువబడినది. ఇక రెండవ దశయందు కులమునందుండి కౌమారావస్థను అధిగమించిన పరాశక్తి - బ్రహ్మగ్రంధిని భేదించుకొని బయల్వెడలిన పరాశక్తి విష్ణుగ్రంధి ప్రభేదనము చేయును. ఇది ¸°వనావస్థ.

''కుల యోషిర్కులం త్యక్త్వా|రాతి విష్ణోః ప్రభేదనే||''

అను సనత్కుమార వచనము ననుసరించి అమ్మ ఇట ''కులయోషి'' యని పిలువబడినది. మూడవదశయందు పరాశక్తి - విష్ణుగ్రంధినుండి బయల్వెడలి రుద్రగంధి ప్రభేదన మొనర్చుకొని సహస్రారమును ప్రవేశించి సదాశివుడను తనపతితో అమృతాస్వాదన మొనర్చుచు నిరంతరము రమించుచుండును. ఇట ''అమ్మ'' ''పతివ్రత'' యని పిలువబడినది.

అగ్నిస్తదనువేధతి||

ఇట్టి అవస్థాత్రయము నధిగమించుటకు స్వాధిష్ఠానగతాగ్ని తోడ్పడుచున్నది.

ఫలితార్ధము:- ప్రాణవాయువును కుంభించి స్వాధిష్ఠానగతాగ్నిని ప్రజ్వలింప జేయవలయును. అపుడే అగ్నిశిఖానువిద్ధ విలీన చంద్రమండలగళ త్పీయూషధారా రసాస్వాదన మొనర్చుటకును పంచవింశతితత్త్వాతీతయైన షడ్వింశతి తత్త్వాత్మికయైన అమ్మను పరాశక్తిని చేరుటకును సురకరమగును. ''తత్త్వాధికాయైనను'' ''సహస్రనామాస్మృతి'' - శ్రీ శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలో పై భావమునే ఇటుల నుదహరించినారు.

శ్లో|| మహీం మూలధారే కమపి మణివూరే హూతవహం

స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి,

మనో7పి భ్రూమధ్యే సకల మపి భిత్త్వాకులపథం

సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి||

మూలాధారము, స్వాధిష్ఠానము, మణివూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ అను ఆరుచక్రములు; పృథివ్యప్తేజోవాయు రాకాశాది పంచమహాభూతములు, మనస్సు వెరశి ఆఱు, వరుసక్రమమున వానివాని స్థానములు=ఈ షట్చక్రములకు 'కులపథము'' అనిపేరు. తదుపరి శిరమునందలి సహస్రారమే ''ఆకులపథము'' అని చెప్పబడుచున్నది.

''కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ,

ఆకులా సమయాంతస్థా సమయాచార తత్పరా|| ''

--- సహస్రనామస్మృతి.

హే కుండలినీ స్వరూపిణీ! భగవతీ! సర్వతత్త్వ మయీ! పరాశక్తీ! నీవు ''సదాశివాఖ్య పరవస్తువ్యగ్రవై'' మూలాధార; స్వాధిష్ఠాన; మణిపూరకా7నాహత విశుద్ధాజ్ఞానరూప, షట్చక్రములయందున్న పృథివ్యగ్నిజల పవనాకాశ మనస్తత్త్వములను అధిగమించి, సహస్రారమున ''చంద్రికా ప్లుత సౌధాగ్రమున'' నీ భర్తయగు సదాశివునితో క్రీడింతువు.

''ప్రతిపన్ముఖ్య కళానిధానమయి, శశ్వత్‌స్థాయియై, సాదనాస్తుతకా నీవు, సదాశివాఖ్య పరవస్తువ్యగ్రవై చంద్రికా ప్లుతసౌధాగ్రమునందునిల్చుతఱి, మీపూతాంఘ్రలన్‌మున్గి, నా స్థితియే నేనెఱుగంగలేని సుఖమందే లేల్పుమమ్మా! ఉమా!''

----- శ్రీ శ్రియానందనాథ.

బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధుల ఆగామి, సంచిత, ప్రారబ్ధములను మూడు తెఱగులుగా ఉపనిషత్తులయందు నిర్వచింపబడినవి. వీని వివరములను శ్రీ శ్రియానందగురుదేవులు తమ ''శాస్త్రసాధనము'' అను గ్రంథమున ఈ దిగువ నుదహరించిన తెఱగున సెలవిచ్చినారు.

ఆగామి, సంచిత, ప్రారబ్ధము లనియెడు మూడును సంసారవృక్షమునకు మూడు వేళ్ళు. ఈ మూడు వేళ్లు తెగినప్పుడే, సంసారవృక్షము చల్లగా నెండిపోయి, మఱి చిగుర్పదు. దీని తాంత్రిక యోగానుశీలమువలన:-

(1) ''అసతో మా సద్గమయ'' ఆసత్తునుండి తొలగించి, సత్తువ జేర్చుము, సగుణాశ్రయము మెల్లగా దప్పించి, నిర్గుణాశ్రయమిమ్ము. ఈ లాభము జీవునకు మూలాధార, స్వాధిష్ఠానము లనెడి బ్రహ్మగంధిని భేదించునప్పుడే కలుగును. ఇదే దుర్గాసప్తశతియందు ప్మరథమఖండమున మధుకైటభవధముగా సవన్వయింపబడిన ప్రారబ్ధక్షయము.

(2) ''తమసోమా జ్యోతిర్గమయ'' తమోరూపాంధకారమును (అజ్ఞానమును) తొలగించి జ్ఞానమయ దివ్యజ్యోతియందు మమ్ము ప్రతిష్ఠింపుము. ఈ లాభము జీవునకు మణిపూరా7నా హత చక్రములనెడి విష్ణుగ్రంధిని భేదింపగల్గునపుడే యగును. దుర్గాసప్తశతియందు రెండవఖండమున రజోగుణ మహిషాసురవధముగా ''ఆగామికర్మ'' క్షయము సమన్వయింపబడినది.

(3) ''మృత్యోర్మా అమృతంగమయ'' జననమరణాది వికారములవలన నుద్ధరించి సన్నానందమయామృతస్వరూపమందు ప్రతిష్ఠింపుము. ఈ చరమకృతార్థత విశుద్ధాజ్ఞాచక్రములను భేదింపగలిగినపుడే యగును. ఇదే శుంభవధమనెడి ''రుద్రగంధి'' భేదనము. దుర్గాసప్తశతియందు మూడవఖండమున రుద్రగంధి భేదనము సంచితకర్మయముగా సమన్వయింపబడినది. పైవ వివరములు తెలియగోరు పాఠకమహాశయులు శ్రీవారి ''చండీతత్త్వసారము'' అను నామాంతరము గల ''శాస్త్రసాధనము'' చదువ ప్రార్థితులు.

శ్రీ విద్యోపాసనకు అర్హులు ఎవరు?

24. అశృతాసః శృతాపశ్చ | యజ్వానో యే7వ్య యజ్వనః | స్వర్యంతో నాపేక్షన్తే||

పండితులు, పామరులు త్రైవర్ణికులగు బ్రహ్మక్షత్రియ వైశ్యులు - ''తస్మాచ్ఛూద్రో యజ్ఞే7సపక్లుప్తః'' అను శ్రుతి ప్రమాణముననుసరించి అనధికారులుగా నిర్ణయిపంబడిన నాలవజాతివరును, స్త్రీలును అందరును ఎట్టి తరతమ భేదము లేకుండ శ్రీవిద్యోపాసనకు అర్హులే - అధికారులే. గురూపదిష్ట మార్గమున నిరంతరమైన సాధనచే ఉపాసనయందు ఉత్తీర్ణులైనవారు క్షణికములైన స్వర్గఫలమునుగూడ నపేక్షింపరు.

శ్రీవిద్యోపాసన వినాగా తదితర విద్యలు ప్రమాద భూయిష్ఠములు అని భగవతిశ్రుతి ప్రతిపాదించుచున్నది.

25 ఇన్ద్ర మగ్నించ యే విదుః | సికతా ఇవ సంయంతి

రశ్మిభిః సముదీరితాః | అస్మాల్లోకాదముష్మాచ్చ||

అల్పఫల ప్రదాతలగు ఇంద్రాదిదేవతలను పృథివ్యాది శివాంతమగు పంచవింశతి తత్త్వములను ఉపాసించు మందభాగ్యులు 'సిక తా ఇవ' అనగా పెనుగాలిచే ఎగురగొట్టబడిన చెల్లాచెదురు చేయబడిన ఇసుకరేణువులవలె భ్రష్టులగుచున్నారు. ''చిన్నాభ్రమివ'' చెదరిన మేఘమువలె నశించుచున్నారు. త్రాడు తెగిన గాలిపటమువలె స్థానభ్రంశము నొంది అగతికు లగుచున్నారు. ఇంతియేగాక ''రశ్మిభిః'' అనగా యమపాశములచే బద్ధులై ఆముష్మిక భోగములనకు దూరగులై పలుబాధలకు లోనగుచున్నారు.

శ్రు|| అంధం తమః ప్రవిశంతి యే7విద్యా ముపాసతే||

జ్ఞానమార్గ విరుద్ధమైన అన్యదేవతోపాసన సాధకులను ఇహమునకును, పరమునకును దూరగులజేసి అంధతామిశ్రనరకమున గూలద్రోయును.

26. ఋషిభి రదాత్పశ్నిభిః ||

పృశ్నినామక ఋషిశ్రేష్ఠులచే పైన ఉదహరించిన విధముగా వివరింపబడడినది, నిశ్చయము చేయబడినది.

శ్రీవిద్యోపాసన యనగా నిట్టిది:-

శ్లో|| ''విష్ణు శివః సురజ్యేష్ఠో మనుశ్చంద్రో ధనాధిపః

లోపాముద్రా తథాగస్త్యః స్కంధో కుసుమసాయకః ||

సురాధీశో రౌహిణయో దత్తాత్రేయో మహామునిః

దూర్వాసా ఇతి విఖ్యాతా ఏతే ముఖ్యుపాసకాః ||''

-------మానసోల్లాసము.

హరిహరవిరించాదులు, దుర్వాసుడు, లోపాముద్ర, అగస్త్యుడు ప్రభృతులు ముఖ్య ఉపాసకులు, అగ్రగణ్యులు. శ్రీవిద్యయందలి ప్రాశస్త్యమిట్టిది. ఇట్టి అగ్రశ్రేణిఉపాసకులతో తుల్యునిగా గణుతింపదగిన మహనీయుడు - తపశ్శక్తిసంపన్నుడు, మద్గురువరేణ్యుడు వేదమూర్తులైన బ్రహ్మశ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మగారు. నివాసస్థలము : శ్రికాకుళము. దీక్షానామము: శ్రీ శ్రియానందనాథులు.

1. శ్లో|| సత్యేన లోకస్థితి మశ్ను తేహి

నారాయణో దీన జనస్య రక్షా

శ##ర్మేతి సంజ్ఞా పరబ్రహ్మ్య సిద్ధే

స్త్వన్నామ తత్సత్త్వ మవేదయన్నః||

2. శ్లో|| కుచేలం సుస్నిగ్ధం స్వయ ముపగతం కృష్ణభగవాన్‌

సుసంపన్నం చక్రీ శిబిరపి దదౌ తత్పరిమితమ్‌ |

గుణజ్ఞస్త్వం లోకే బహుజన కుటుంబాంశ్చ విపద

సముత్తీర్ణాన్కుర్వన్‌ జనయసి తదంశస్య విభవమ్‌ ||

సాహిత్య విద్యాప్రవీణ, ఉభయభాషాప్రవీణ బ్రహ్మశ్రీ సామవేదసూర్యనారాయణశాస్త్రిగారు పలికిన వేదవాక్కులివి.

నైసర్గికమైన, అమోఘమైన సత్యవాక్కులివి. ఇందు ఎట్టి అతిశయోక్తియులేదు. ఉత్ప్రేక్ష అంతకన్నును కాదు.

శ్రీవారి వంశము:- యజుశ్శాఖీయులు. ఆపస్తంబసూత్రులు. హరితసగోత్రులు వెలనాడు బ్రాహ్మణులు. ఇంటిపేరు ఈశ్వరవారు. జనకులు: తల్లి కామేశ్వరమ్మ, తండ్రి సీతారామశాస్త్రి. జన్మస్థలము : విశాఖ మండలమున వీరవల్లి తాలూకాలోని చోడవరము. జన్మతిథి : శ్రీ వ్యయనామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ పంచమి సోమవారము సరియగు 18-10-1886 తేది.

శ్రీ శర్మగారు తమ రెండేండ్ల ప్రాయమునుండియు శ్రికాకులమునందే యుండిరి. 1904 వ సంవత్సరమున మెట్రిక్యులేషన్‌ పరీక్ష యందు ఉత్తీర్ణులైరి మరి మూడు వత్సరములకు అనగా 1907 నాటికి తమ వంశక్రమానుగత వైద్యవిద్యయందు ''ఆయుర్వేదవాచస్పతి'' ''వైద్యవిద్యార్ణవ'' యను పట్టముల బడసిరి. విజయనగరవాసుటు బ్రహ్మశ్రీ పిలకామూర్తి రాజుగారి రెండవకుమార్తెను శ్రీ కామేశ్వరమ్మగారిని పరిణయమాడిరి. వివాహునాటికి వారి వయస్సు ఇరువది హయనములు.

ఈ పుణ్యదంపతులకు వెంకటసూర్యనారాయణ యను పుత్రుడును; సీతారామమ్మ, ఇందుమతి, మీనాక్షి, వెంకటలక్ష్మి యను నలుగురు కుమార్తెలును గలరు.

శ్రీ శర్మగారు విద్వద్వైద్యులై గురుకుళాశ్రమ మేర్పఱచి విద్యార్థుల కాయుర్వేదము గఱపి అందు పట్టభద్రులజేసిరి. శ్రికాకుళములోని పురపాలకోన్నత పాఠశాలయందు ఇరువదియైదు సంవత్సరములు ప్రధాన పండితపదవి నధిష్టించి బహుసంఖ్యాక శిష్యులను స్నాతకులజేసిరి. యక్షగానములు రచించి అనేకులను శిక్షించి భిక్షపెట్టి హరిదాసులుగావించి ఇహపరసాధనమగు బ్రతుకుతెఱువు చూపించిరి. శ్రీవిద్యోపాసనయందు అగ్రశ్రేణి నధిష్ఠించి అసంఖ్యాకులైన ముముక్షువులకు దీక్ష నొసంగి శ్రీమాతృకృపకు పాత్రులు జేసిరి. ఉపాసనా పటిమచే కుష్ఠు మెదలగు భయంకరవ్యాధులను రహితము జేసరి. ఎందరినో పిశాచారిష్టముల బారినుండి కాపాడిరి. భవరోగార్తులపాలిటి అపర ధన్వంతరి. నాటినుండి నేటివరకు శ్రికాకుళములోని వారి ఇట్లు ఒక తీర్థయాత్రాస్థలము. దేశము లోని నలుతెఱగులనుండియు ఆర్తులు, జిజ్ఞాసువులు వారిని దర్శింప సహరహము వచ్చుచున్నారు. ద్రవ్యయజ్ఞరూపమున అనేక శాశ్వతకార్యము లొనర్చిరి.

(1) సౌందర్యలహరికి ఆంధ్రానువాదము (2) శ్రీసూక్త రహస్యార్థము (3) సత్యనారాయణశర్మ సాధనము (4) దేవీ సూక్తపరమార్థము (5) భీమేశ్వరనుతి (6) బాలాంబాశతకము (7) దేవపూజారహస్యము (8) శాస్త్రసాధనము (9) శ్రీ రాజవిద్యాగీత (10) శ్రీ సిద్ధాంతశిఖామణి వివరణ (11) అమ్మతో ముచ్చటలు (12) మహాసౌరమంత్రపాఠమునకు ఆంధ్రపద్యానువాదము మున్నగు ఆధ్యాత్మికగ్రంథములరచించి ఆంధ్రసాధక లోకమునకు బహుళోపకారము జేసిరి.

ఇంకను సప్తశతీ (చండీపాఠ) విపులాధ్యాత్మికావివరణము; శ్రీవిద్యాంధ్రభాష్యము; రుద్రకోటీశ్వర శతకము; హ్రీంకారశతకము మున్నగు గ్రంథములు ముద్రనకు ఎదురుచూచుచున్నవి.

అశేషశేముషీధురంధరులు - శ్రీ శ్రియానందనాథులు. అనేక కోటి హృత్పద్మకప్రకాశక మహారవి - శ్రీ శ్రియానందనాథులు. ప్రాచీనఋషి ప్రతిబింబము - శ్రీ శ్రియానందనాథలు. పరిశిష్ఠ పరానంద పరాశ్రీ శ్రీమాత అనుంగుబిడ్డడు - శ్రీ శ్రియానందనాథులు.

కులమునందుండి సత్య కర్మ సాధనము నుపన్యసించి ప్రబోధించి బద్ధజీవులను సన్మార్గాభిముఖులనుజేయు ఈశ్వరుడు - శ్రీ శ్రియానందనాథులు.

'దేవీనూక్తపరమార్థ' సూత్ర సుదర్శనచక్ర పరిభ్రమణధ్వని స్మృత్యాద్వైతభావ భావుకుడగు 'సత్యనారాయణుడు' - శ్రీ శ్రియానందనాథులు.

సువర్ణరజత నవరత్న ప్రభాతేజో విరాజిత దివ్యమంగళ స్వరూపమున సహస్రారకమలమున సాక్షాత్కరించు కమలకు అనుంగునచివుడు - శ్రీ శ్రియానందనాథులు.

ఆంధ్ర సాధకలోకము పాలిటి అనేక కోటి జన్మార్జిత పుణ్యపుంజపక్వకైవల్యఫలము - శ్రీ శ్రియానందనాథులు.

కోటిసూర్య ప్రతీకాశ మహాచిన్మండలస్థిత శ్రీ శ్రియానంద శ్రీగురు ప్రతిబింబము - శ్రీ శ్రియానందనాథులు.

ఏవంగుణ విశేషణ విశిష్ఠులు, మద్గురవరేణ్యులు - శ్రీ శ్రియానందనాథులు.

స్వవిషయము :-

వంశము:- శుక్లయజుర్వేదాంతర్గత కాణ్వశాఖ. కాత్యాయనీ సూత్రము. కౌండిన్యసగోత్రము. ప్రథమశాఖ. నియోగి బ్రహ్మణుడను. ఇంటిపేరు మఱ్ఱిపాటివారు.

జనకులు: తల్లి కృష్ణవేణమ్మ, తండ్రి భానుమూర్తి. సీతారామరావు కనిష్ఠసోదరుడు. సీతారామమ్మ అక్కగారు. సావిత్రమ్మ చెల్లెలు. అప్పదాసుగారి శిష్యుడు. భారద్వాజసగోత్రుడు. వంగిపురపు వీరభద్రకవి మేనమామ. నాపేరు వేంకటనరసింహారావు. తెనాలితాలూకా యలవఱ్ణు జన్మస్థలము. ఇంటూరులోని హైందవోన్నత పాఠశాలయందు విద్యాభ్యాసము. అభినవ జయదేవ బిరుదాంకితలు కీ|| శే|| చల్లా పిచ్చయ్యశాస్త్రిగారివద్ద సంస్కృతవిద్యాభ్యాసము. 26-6-1913 తేదీన జననము.

ప్రస్తుతము మైసూరు రాష్ట్రాంతర్గత షిమోగా మండల మందలి షరావళీ ప్రాజక్టులోని లింగనమక్కిలో నున్నాను. M/S గ్యానన్‌డంకర్లేఅండుకో., అను ఇంజనీరింగు కంట్రాక్టర్సు సంస్థలో గత ఇరువదిరెండు సంవత్సరములుగా ఒక సామాన్య ఉద్యోగిని.

పెద్ద చదువులు చదువలేదు. పట్టములు పొందలేదు.

కృష్ణామండలములోని మైలవరములో కీ|| శే|| సుకమంచి సుబ్రహ్మణ్యదాసుగారివద్ద యోగవిద్య నభ్యసించితిని. 1934 లో, 1858 నుండి 1962 వరకు వేదమూర్తులు బ్రహ్మశ్రీ శ్రీనివాస ఘనపాఠిగారివద్ద ఉపనిషత్తులు అధ్యయనముచేసితిని.

వీరు తంజావూరు జిల్లాలోని ''కోమల్‌'' అను గ్రామవాసులు. శ్రీ శ్రియానందగురు పదముల నాశ్రయించి 2-12-1955 వ తేదీన శ్రీ విద్యాదీక్ష స్వీకరించితిని. నా ఉపాస్యదేవత షోడశీ నామాంకిత శ్రీ రాజరాజేశ్వరీ పరాభట్టారికి.

శ్రు|| ''శ్రీగురుః సర్వకారణభూతాశక్తిః ''

---- భావనోపనిషత్తు.

శ్రీ గురువుల కృపాపాత్రుడనైతిని. '' శ్రీతత్త్వము'' రచించితిని. నా ప్రేమనిధానము నా ఆధ్యాత్మిక సహధర్మ చారిణి కీ|| శే|| కమలాదేవి. ఆమె దివ్యప్రేరణయే నా యీ రచనకు సాహసింపజేసినది. శ్రీ గురుదేవుల ఉపదేశసారాంశముల ప్రశ్నోత్తరముల మూలమున పరస్పరము చర్చించుకొనుచుమననముచేయుచుండుట మానిత్యదినచర్య. ఆమధురస్మృతులే రూపముదాల్చి ''శ్రీతత్త్వము''గా పాఠకుల కరకమలముల నలంకరించినది. ఏతత్‌ గ్రంథపఠనచే యేయొక్క పాఠకుడైనను ఇంచుకంత ప్రయోజనము గాంచినను నాకృషి ఫలించినటులనే, నాజన్మ సార్థకతచెందినటులనే విశ్వసింతును.

శ్లో|| కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః |

సుకృతే దుష్కృతే చైవ చత్వార స్సమభాగినః ||

తమ నిస్స్వార్థత్యాగశీలముచే ఆంధ్రపాఠకలోకమునకు అనుపమానమైన సేవ చేయుచున్న సాధనగ్రంథమండలి వ్యవస్థాపకులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ విద్వా9 బులుసు సూర్యప్రకాశశాస్త్రిగారు గ్రంథముద్రణ భారమును వహించుటయే గాక ఎన్నియోవిధముల తోడ్పడినారు. నాకు గల ఉద్యోగ ధర్మములను సడలించి ''శ్రీ తత్త్వము'' రచించు సదవకాశమును కలిగించిన ఉదారహృదయుడు, సత్యధర్మపరాయణుడు, నాపై అధికారి బ్రహ్మశ్రీ K.కృష్ణమూర్తిగారు. వ్రాత మూలమును ఓపికతో విని అమూల్యములైన సలహాలనిచ్చిన నా సహోద్యోగులు శ్రీయుతులు బ్రహ్మశ్రీ గనపతిశాస్త్రి, A.D. పద్మ నాభఅయ్యరు, శ్రీరామనాథఅయ్యరు, T.S.G. వెంకటరావు, K. సంతానము ప్రభృతులు, వీరందరకు నా ధన్యవాదములు.

కోరినదే తడవుగా ఆశీర్వదించి తమ యమూల్యాభిప్రాయముల నొసగిన జగద్గురువలు శ్రీ శృంగేరీ, శ్రీ సదనమ్‌, శ్రీ గాయత్రీ పీఠముల అధిపతులకు నా హృదయపూర్వక నమస్కారములు.

ఈగ్రంథమునకు అవతారిక వ్రాసిఇచ్చిన ఉదాత్తహృదయులు బ్రహ్మశీ తూములూరి శివరామకృష్ణమూర్తి M.A. గారికి; అభిప్రాయముల నొసగిన శ్రీ నిర్వికల్పానందస్వామి, శ్రీ కేశవతీర్థస్వామి, శ్రీ ధర్మాల సుబ్బరాయశాస్త్రిగార్లకు నా కృతజ్ఞతా పూర్వక నమస్కారములు.

శోభకృత్తు శ్రావణ శుక్లసప్తమి,

మందవాసరము : 27-7-1963,

లింగనమక్కి - షిమోగాజిల్లా,

మైసూరు రాష్ట్రము. మఱ్ఱిపాటి వేంకటనరసింహారావు.

---------

Sri Tattvamu    Chapters